రాముడిగా రణ్‌బీర్‌పై ట్రోల్స్.. స్పందించిన సద్గురు

  • నటుడి గత పాత్రలను బట్టి విమర్శించడం అన్యాయమన్న సద్గురు
  • సినిమా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన వివేక్ ఒబెరాయ్
  • రావణుడిగా నటిస్తున్న యశ్‌ను ప్రశంసించిన సద్గురు
బాలీవుడ్ దర్శకుడు నితీశ్‌ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుండటంపై కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ స్పందించారు. రణ్‌బీర్‌ ఎంపికను ఆయన గట్టిగా సమర్థించారు.
 
ఈ సినిమా నిర్మాత నమిత్‌ మల్హోత్రాతో జరిగిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సద్గురు మాట్లాడారు. గతంలో రణ్‌బీర్‌ కొన్ని భిన్నమైన పాత్రలు చేశాడని, ఇప్పుడు రాముడి పాత్రకు సరిపోడంటూ ట్రోల్ చేయడం అన్యాయమని అన్నారు. ‘భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి ముందే తెలియదు కదా? రేపు మరో సినిమాలో రావణుడిగా నటించవచ్చు. అప్పుడు కూడా ఇలాగే విమర్శిస్తారా? ఇది సరైన పద్ధతి కాదు’ అని సద్గురు హితవు పలికారు. ఇదే సమయంలో రావణుడిగా నటిస్తున్న యశ్‌ అందమైన, తెలివైన వ్యక్తి అని ప్రశంసించారు.
 
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. భారతీయ సినిమాకు ‘రామాయణ’ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నీ దేవోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


More Telugu News