కాకినాడ అనుకుంటే నరసాపురం.. అంచనాలకు అందని 'మొంథా'

  • మొంథాను ఓ విలక్షణమైన తుపానుగా పేర్కొన్న నిపుణులు
  • తీరం దాటే ప్రాంతంపై వాతావరణ శాఖలో చివరిదాకా గందరగోళం
  • కాకినాడ వద్ద అనుకుంటే నరసాపురం దగ్గర తీరాన్ని తాకిన వైనం
  • తొలుత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు
  • ఉత్తరాంధ్రలో ముందుగానే కురిసి తీరం దాటేప్పుడు తగ్గిన వర్షపాతం
  • తుపాను తూర్పు భాగం బలహీనపడటమే కారణమని నిపుణుల విశ్లేషణ
మొంథా తుపాను అంచనాలను తలకిందులు చేస్తూ, వాతావరణ శాఖ అధికారులను సైతం గందరగోళానికి గురిచేస్తూ చివరకు నరసాపురం సమీపంలో తీరం దాటింది. ఇది మిగిలిన తుపానులతో పోలిస్తే చాలా భిన్నమైనదని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తుపాను తీరం దాటే ప్రాంతంపై చివరి వరకు స్పష్టత లేకపోవడం దీని విలక్షణతకు అద్దం పడుతోంది.

గత మూడు రోజులుగా కాకినాడకు దక్షిణంగా తుపాను తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అయితే, బుధవారం నాటికి అంచనాలు మారి హంసలదీవి, అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చివరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వాతావరణ పరిశీలన కేంద్రంలో నమోదైన గాలుల వేగం, వాతావరణ పీడనం ఆధారంగా.. తుపాను అక్కడికి సమీపంలోనే తీరం దాటినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

తుపాను ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంది. దీని పశ్చిమ భాగం మంగళవారం ఉదయమే నెల్లూరు జిల్లాను తాకడంతో అక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు, తుఫాను ఉత్తర భాగంలోని మేఘాల ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని వాతావరణ అధికారి జగన్నాథకుమార్‌ తెలిపారు. అయితే, తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో వర్షాలు తక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు.

ఈ విచిత్రమైన పరిస్థితిపై జగన్నాథకుమార్‌ మాట్లాడుతూ, "వాతావరణంలో మార్పుల వల్లే ఇలా జరిగిందని కచ్చితంగా చెప్పలేం. తుఫాను తూర్పు భాగం విచ్ఛిన్నమై, పశ్చిమ భాగంలో నీటి మేఘాలు ఎక్కువగా కేంద్రీకృతం కావడం వల్లే ఇది నరసాపురం వైపు కదిలింది. ఒకవేళ తూర్పు భాగంలో 'విండ్‌ షీర్‌' బలంగా లేకపోయి ఉంటే, అది మొదట అంచనా వేసినట్లు కాకినాడ వైపే వచ్చి ఉండేది" అని విశ్లేషించారు. మొత్తంమీద మొంథా తన గమనాన్ని మార్చుకుంటూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది.




More Telugu News