మూడోసారి పోటీకి ఆస్కారం లేదన్న ట్రంప్.. తన వారసుడిపై హింట్

  • మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయలేనని అంగీకరించిన ట్రంప్
  • అమెరికా చట్టాలు అందుకు అనుమతించవని స్పష్టీకరణ  
  • తన రాజకీయ వారసుడిగా జేడీ వాన్స్‌ పేరును ప్రస్తావించిన అధ్యక్షుడు
  • వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు మంచి అవకాశాలున్నాయని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. అమెరికా చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు వీలుందని, తాను మూడోసారి పోటీ చేయలేనని ఆయన బుధవారం పేర్కొన్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఇది చాలా ఆసక్తికరమైన విషయం. చాలా ఏళ్లలో ఏ అధ్యక్షుడికీ లేనన్ని మంచి నంబర్లు నాకు ఉన్నాయి. చట్టాన్ని చదివితే చాలా స్పష్టంగా ఉంది.. నేను పోటీ చేయడానికి వీల్లేదు. ఇది చాలా బాధాకరం. కానీ మన దగ్గర చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు" అని ట్రంప్ వివరించారు. తన పాలనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ, చట్టపరమైన నిబంధనల వల్ల పోటీ చేయలేకపోతున్నానని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

గతంలో ట్రంప్ మూడోసారి పోటీ చేసేందుకు ‘కొన్ని మార్గాలున్నాయి’ అంటూ పదేపదే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చట్టాన్ని రకరకాలుగా అన్వయించుకోవచ్చని, ఆయన మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందని ఆయన మద్దతుదారులు కూడా ప్రచారం చేశారు. అయితే, తాజా వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి ట్రంప్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు.

ఇక తన రాజకీయ వారసుడి గురించి కూడా ట్రంప్ గతంలోనే సంకేతాలిచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన వారసుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. "నిజాయతీగా చెప్పాలంటే, ఆయనే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి.. జేడీ వాన్స్‌కే అవకాశాలు ఎక్కువ. బహుశా మార్కో రూబియో కూడా జేడీతో కలిసే అవకాశం ఉంది. అయితే, దీని గురించి మాట్లాడటానికి ఇది చాలా తొందరపాటు అవుతుంది. కానీ వాన్స్ అద్భుతంగా పనిచేస్తున్నారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా స్పందిస్తూ, జేడీ వాన్స్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే 'గొప్ప నామినీ' అవుతారని పేర్కొనడం గమనార్హం.


More Telugu News