రైలు టాయిలెట్‌లో కొండచిలువ.. హడలెత్తిపోయిన ప్రయాణికులు!

  • అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో కొండచిలువ సంచారం
  • ఎస్‌-2 కోచ్ వాష్‌రూంలో పామును గుర్తించిన టీటీఈ
  • భయంతో వణికిపోయిన ప్రయాణికులు
  • ఖమ్మం స్టేషన్‌లో రైలును నిలిపివేసిన అధికారులు
  • కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్
పరుగులు తీస్తున్న రైలులో కొండచిలువ కనిపించడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించి, రైలును మధ్యలో నిలిపివేశారు. అనంత‌రం స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కొండచిలువను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయాన‌క‌ ఘటన అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... చెన్నై వెళుతున్న అండమాన్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 16032) సోమవారం రాత్రి డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న టీటీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌-2 కోచ్‌లోని వాష్‌రూంలో ఓ కొండచిలువ కదులుతూ ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన, ప్రయాణికులను ఆ వైపు వెళ్లకుండా నిలువరిస్తూనే, ఖమ్మం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుర్రా సురేశ్‌ గౌడ్‌కు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన సీఐ సురేశ్‌ గౌడ్, ఖమ్మంలో పాములు పట్టడంలో నిపుణుడైన మస్తాన్‌ను సంప్రదించారు. రైలు ఖమ్మం స్టేషన్‌కు చేరుకునే సమయానికి ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ షేక్ మోదీనా, కానిస్టేబుల్ సీహెచ్ మధన్ మోహన్‌తో పాటు స్నేక్ క్యాచర్ మస్తాన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వద్ద సిద్ధంగా ఉన్నారు. రైలు స్టేషన్‌కు రాగానే, మస్తాన్ చాకచక్యంగా బోగీలోకి ప్రవేశించి కొండచిలువను పట్టుకున్నారు.

కొండచిలువను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైలు ఎలాంటి ఆలస్యం లేకుండా చెన్నైకి బయలుదేరింది. సమయానికి స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన రైల్వే సిబ్బందిని, ధైర్యంగా పామును పట్టిన మస్తాన్‌ను ప్రయాణికులు అభినందించారు. ఈ సందర్భంగా సీఐ సురేశ్‌ గౌడ్, మస్తాన్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.


More Telugu News