గాయపడిన ఇరాన్ మత్స్యకారుడిని కాపాడిన భారత కోస్ట్ గార్డ్ దళం

  • అరేబియా సముద్రంలో ఇరాన్ జాలరిని రక్షించిన కోస్ట్ గార్డ్
  • నౌకలో ఇంధనం మార్చుతుండగా పేలుడు.. కళ్లకు తీవ్ర గాయాలు
  • కొచ్చికి 1500 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన
  • సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ఐసీజీ షిప్ సచేత్
  • ప్రస్తుతం కోస్ట్ గార్డ్ నౌకలో బాధితుడికి వైద్య చికిత్స
  • మెరుగైన వైద్యం కోసం గోవాకు తరలింపు
అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (ICG) మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కొచ్చి తీరానికి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో తీవ్రంగా గాయపడిన ఇరాన్‌కు చెందిన ఒక జాలరిని ఐసీజీ నౌక 'సచేత్' సిబ్బంది అత్యంత చాకచక్యంగా రక్షించారు. మంగళవారం ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.

'అల్-ఒవైస్' అనే ఫిషింగ్ నౌకలో జనరేటర్‌కు ఇంధనం బదిలీ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ నౌకలోని జాలరి రెండు కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుడి చెవికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌక ఇంజిన్ కూడా ఫెయిల్ అవడంతో ఐదుగురు సిబ్బంది సముద్రంలో చిక్కుకుపోయారు.

ఈ ఘటనపై ఇరాన్‌లోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) చాబహార్ నుంచి ముంబైలోని MRCC కేంద్రానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత అధికారులు అంతర్జాతీయ సేఫ్టీ నెట్‌ను యాక్టివేట్ చేసి, సమీపంలో ఉన్న నౌకలను అప్రమత్తం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న ఐసీజీ షిప్ సచేత్‌తో పాటు, కువైట్ నుంచి మొరోనీ వెళుతున్న మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న 'ఎంటీ ఎస్‌టీఐ గ్రేస్' అనే ట్యాంకర్‌ను వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తొలుత 'ఎంటీ ఎస్‌టీఐ గ్రేస్' ట్యాంకర్ ప్రమాదానికి గురైన నౌక వద్దకు చేరుకుంది. ఐసీజీ వైద్య సిబ్బంది టెలీ-మెడికల్ మార్గదర్శకత్వంలో ట్యాంకర్ సిబ్బంది గాయపడిన జాలరికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఐసీజీ షిప్ సచేత్ అక్కడికి చేరుకుని బాధితుడిని తమ నౌకలోకి బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ జాలరికి ఐసీజీ నౌకలోనే వైద్య చికిత్స అందిస్తున్నారని, మెరుగైన వైద్యం కోసం గోవాకు తరలిస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

దేశ సరిహద్దులకు ఆవల కూడా సముద్ర భద్రత, మానవతా సహాయం అందించడంలో ఐసీజీ నిబద్ధతకు ఈ సాహసోపేత ఆపరేషన్ నిదర్శనమని పేర్కొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో విశ్వసనీయమైన ఏజెన్సీగా ఐసీజీ తన పాత్రను మరోసారి నిరూపించుకుందని వివరించింది.

కాగా, గత వారం గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL)లో నిర్మించిన రెండు అధునాతన ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ (FPV) 'ఐసీజీఎస్ అజిత్', 'ఐసీజీఎస్ అపరాజిత్'లను కోస్ట్ గార్డ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశీయంగా నిర్మిస్తున్న 8 నౌకల సిరీస్‌లో ఇవి ఏడు, ఎనిమిదో నౌకలు. ఇది దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో కీలక ముందడుగు అని అధికారులు తెలిపారు.


More Telugu News