నాకు డబ్బు ముఖ్యం కాదు: ప్రియమణి

  • హీరోల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నా బాధపడలేదన్న ప్రియమణి
  • డబ్బు కంటే మంచి పాత్రకే తన మొదటి ప్రాధాన్యత అని వ్యాఖ్య
  • పాత్రకు అర్హురాలిని అనిపిస్తేనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తానని వెల్లడి
సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో చర్చలో ఉన్న ‘వేతన అసమానత’ అంశంపై నటి ప్రియమణి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. కథానాయకులతో పోలిస్తే తనకు తక్కువ పారితోషికం లభించిన సందర్భాలు ఉన్నప్పటికీ, తాను డబ్బు కంటే పాత్రలకే ఎక్కువ విలువ ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే, నా కెరీర్‌లో చాలాసార్లు నా సహనటుల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. కానీ ఈ విషయం నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు. ఎందుకంటే నేను డబ్బు కోసం సినిమాలు చేయను. నాకు పాత్ర నచ్చితే, అది ఎంత చిన్నదైనా సంతోషంగా ఒప్పుకుంటాను. సాధారణంగా స్టార్‌డమ్‌ను బట్టి పారితోషికం నిర్ణయిస్తారు, దాన్ని నేను గౌరవిస్తాను. అయితే ఒక పాత్రకు నేను అర్హురాలినని నాకు అనిపించినప్పుడు మాత్రం కచ్చితంగా డిమాండ్ చేస్తాను. కానీ అనవసరంగా రెమ్యూనరేషన్‌ పెంచమని అడగను. నటన వల్లే ప్రేక్షకులు మనల్ని గుర్తుంచుకుంటారు కానీ, మన పారితోషికం వల్ల కాదు” అని ప్రియమణి వివరించారు.

ఇదే ఇంటర్వ్యూలో, దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమల్లో పని విధానంలో ఉన్న తేడాల గురించి కూడా ఆమె ఆసక్తికరంగా మాట్లాడారు. “సౌత్‌లో ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే, సరిగ్గా ఆ సమయానికే మొదలవుతుంది. కానీ నార్త్‌లో మాత్రం ఆ సమయానికి నటీనటులు ఇంటి నుంచి బయల్దేరుతారు. వర్క్ డిసిప్లిన్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది” అని ఆమె తెలిపారు.

ప్రస్తుతం ప్రియమణి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, ‘ది గుడ్ వైఫ్’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను పలకరించిన ఆమె, త్వరలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ చిత్రం ‘జన నాయగన్‌’లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.


More Telugu News