శ్రేయస్ అయ్యర్‌కు ఊరట.. ఐసీయూ నుంచి బయటకు

  • భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు తప్పిన పెను ప్రమాదం
  • ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలింపు
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ప్లీహానికి గాయం
  • అద్భుతమైన క్యాచ్ పడుతూ తీవ్రంగా గాయపడ్డ అయ్యర్
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన, ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయ్య‌ర్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్య వర్గాలు తెలిపాయి.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ నెల‌ 25న జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. తొలుత ఆయన పక్కటెముకలకు గాయమైందని భావించినప్పటికీ, స్కానింగ్‌లో ప్లీహానికి (Spleen) తీవ్రమైన గాయమైనట్లు తేలింది. దీంతో హుటాహుటిన సిడ్నీలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆయనతో నిరంతరం టచ్‌లో ఉందని, ఆయన కోలుకుంటున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స‌మాచారం. త్వరలోనే అయ్యర్ కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

ఈ ఘటనపై బీసీసీఐ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయ్యర్ పక్కటెముకల కింది భాగంలో బంతి బలంగా తాకింది. స్కానింగ్‌లో ప్లీహానికి గాయమైనట్లు నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. సిడ్నీ, భారత వైద్య నిపుణులతో కలిసి బీసీసీఐ వైద్య బృందం ఆయన పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. టీమిండియా డాక్టర్ సిడ్నీలోనే అయ్యర్‌తో ఉండి ఆయన రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తారు" అని బీసీసీఐ పేర్కొంది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 33వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని వెనక్కి పరుగెడుతూ అయ్యర్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నారు. అయితే, ఈ క్రమంలో కిందపడటంతో ఆయనకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం అయ్యర్ చికిత్సకు స్పందిస్తుండటంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, జట్టు యాజమాన్యం ఆశిస్తున్నారు.


More Telugu News