మహిళల వరల్డ్ కప్... సెమీస్ ముంగిట భారత జట్టుకు ఎదురుదెబ్బ

  • గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన ప్రతీక రావల్
  • ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన యువ బ్యాటర్ షెఫాలీ వర్మ
  • అక్టోబర్ 30న ఆస్ట్రేలియాతో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్
  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన భారత బ్యాటర్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు కీలక మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయింది.   బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె గాయపడగా, ఆమె స్థానంలో యువ క్రీడాకారిణి షెఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్నారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీని ఆపే ప్రయత్నంలో ప్రతీక రావల్ చీలమండకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రతీక స్థానంలో షెఫాలీ వర్మను ఎంపిక చేయడానికి ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది.

ఈ ప్రపంచకప్‌లో ప్రతీక రావల్ అద్భుతంగా రాణించారు. ఏడు మ్యాచ్‌లు ఆడి 308 పరుగులు సాధించారు. ఇందులో న్యూజిలాండ్‌పై చేసిన అద్భుతమైన సెంచరీ (122) కూడా ఉంది. ఇప్పుడు ఆమె స్థానంలో జట్టులోకి వస్తున్న 21 ఏళ్ల షెఫాలీ వర్మ, చివరిసారిగా 2024 అక్టోబర్‌లో వన్డే మ్యాచ్ ఆడారు.

అక్టోబర్ 30న నవీ ముంబయి వేదికగా జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. పటిష్ఠమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టనుంది. కీలకమైన ఈ నాకౌట్ పోరుకు ముందు స్టార్ బ్యాటర్ దూరం కావడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. 


More Telugu News