విజయవాడలో రేపు 16 సెం.మీ వర్షం పడే అవకాశం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

  • 'మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడకు అతి భారీ వర్ష సూచన
  • అప్రమత్తమైన వీఎంసీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం
  • ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారుల విజ్ఞప్తి
  • సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు జారీ
  • నగరవ్యాప్తంగా 34 పునరావాస కేంద్రాల ఏర్పాటు
'మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. మంగళవారం నగరంలో 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు.

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం ఉద్ధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. అయితే, పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454కు గానీ, వీఎంసీ కార్యాలయంలోని 08662424172, 08662422515, 08662427485 నంబర్లకు గానీ సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ముందస్తు చర్యల్లో భాగంగా వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో మొత్తం 34 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కేంద్రాలకు వచ్చే వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం ఉన్నందున, విజయవాడ నగర ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


More Telugu News