Bhagya Shree Borse: దేవుడితో గొడవ... ఆసక్తికర అంశాలు వెల్లడించిన భాగ్యశ్రీ భోర్సే

Bhagya Shree Borse Reveals Interesting Facts About Her Beliefs
  • చిన్నప్పుడు దేవుడితో గొడవపడేదాన్నని చెప్పిన భాగ్యశ్రీ
  • ఇప్పుడు దేవుడి నిర్ణయాలనే పూర్తిగా నమ్ముతానని వెల్లడి
  • ‘కాంత’ చిత్రంలో నటనకు అద్భుతమైన స్పందన లభించిందని ఆనందం
  • కష్టపడితే కచ్చితంగా మంచి స్థానానికి చేరుకుంటామని వెల్లడి
  • తనకు సహకరించిన రానా, దుల్కర్‌ సల్మాన్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు
యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన వ్యక్తిగత విశ్వాసాలు, దైవచింతనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనంలో తనకు ఏదైనా కష్టం వస్తే దేవుడినే తన తండ్రిగా భావించి ఆయనతో పోట్లాడేదాన్నని, కానీ ఇప్పుడు ఆ దేవుడి నిర్ణయాలనే పూర్తిగా విశ్వసిస్తున్నానని తెలిపారు. శుక్రవారం నాడు ఓ ఆలయంలో ప్రశాంతంగా ఉన్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"నాకు గుర్తుంది.. చిన్నప్పుడు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను చేసే మొదటి పని దేవుడితో గొడవపడటమే. ఆయనే నా తండ్రి అన్నట్లు ప్రతీసారి ప్రశ్నించేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఓ దశకు చేరుకున్నాను. నాకేది మంచిదో ఆయనకు కచ్చితంగా తెలుసని ఇప్పుడు నేను నమ్ముతున్నాను" అని తన పోస్టులో ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా మంచి విజయాలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల భాగ్యశ్రీ నటించిన ‘కాంత’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన పీరియడ్ డ్రామా ‘కాంత’లో ఆమె పోషించిన కుమారి పాత్రకు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమా విజయంపై ఆమె మాట్లాడుతూ, కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.

నటుడు రానా దగ్గుబాటిని తన గురువుగా అభివర్ణిస్తూ, "మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన రానాకు ధన్యవాదాలు. మీరు నిజమైన స్నేహితుడు, మంచి వ్యక్తి. ఈ ప్రయాణంలో మీరు నా గురువుగా ఉండటం నా అదృష్టం. మీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఇది చేయగలిగేదాన్ని కాదు" అని తెలిపారు. ఇక తన సహనటుడు దుల్కర్ సల్మాన్‌ను ప్రశంసిస్తూ, "ప్రియమైన దుల్కర్, మీరు నిజమైన 'నడిప్పు చక్రవర్తి'. మీ పక్కన నటించడం గొప్ప అనుభూతి. ప్రతీ ఫ్రేమ్‌లో మీరు అద్భుతంగా కనిపించారు. నటుడిగా మా అందరికీ మీరు ఒక స్ఫూర్తి" అని ఆమె పోస్టులో పేర్కొన్నారు.
Bhagya Shree Borse
Kanta Movie
Andhra King Taluka
Selvamani Selvaraj
Rana Daggubati
Dulquer Salmaan
Telugu cinema
Indian actress
Kumari character
Faith and beliefs

More Telugu News