కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా కవితనే హెచ్చరించారు: మంత్రి కోమటిరెడ్డి

  • కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు దోచుకున్నారని కవిత చెప్పారన్న మంత్రి
  • కాళేశ్వరం అవినీతి అంశంలో రామన్న జాగ్రత్తగా ఉండాలని కవిత అన్నారని వ్యాఖ్య
  • కేటీఆర్ తనస్థాయి వ్యక్తి కాదన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోష్ రావు దోచుకున్నారని, కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలని స్వయంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. "కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంలో... రామన్నా జాగ్రత్త" అని కవితనే హెచ్చరించారని గుర్తు చేశారు.

జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగిన వ్యక్తి కాదని విమర్శించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన గుంటూరులో ఇంకా చదువుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేయని కేటీఆర్ గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు.

బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం: చామల కిరణ్ కుమార్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు.

వరుస ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ కనుమరుగవుతుందనే భయంతో హరీశ్ రావు, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కవిత అవినీతి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కవిత చేసిన ఆరోపణల ఆధారంగానే హరీశ్ రావు, కేటీఆర్‌లపై ఫిర్యాదు చేశామని అన్నారు.


More Telugu News