రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన నారా రోహిత్

  • నటి శిరీష లేళ్లతో అక్టోబర్ 30న నారా రోహిత్ వివాహం
  • హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు ఘనంగా పెళ్లి వేడుకలు
  • ‘ప్రతినిధి-2’ సినిమా సెట్స్‌లో ఇరువురి మధ్య చిగురించిన ప్రేమ 
టాలీవుడ్ హీరో నారా రోహిత్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. నటి శిరీష లేళ్లతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రోహిత్.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివాహ వేడుకలను నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నారా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 25న హల్దీ, 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం, 28న మెహందీ వేడుకలు జరగనున్నాయి. ఇక అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభ ముహూర్తాన రోహిత్, శిరీష ఒక్కటవ్వనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.

‘ప్రతినిధి–2’ సినిమా షూటింగ్ సమయంలో రోహిత్, శిరీష మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది.

దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు కావడంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. రోహిత్ స్వయంగా రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి శుభలేఖలు అందిస్తూ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.


More Telugu News