అమెరికన్లను వేధిస్తున్న అసలు సమస్యలు ఇవే.. సర్వేలో కీలక విషయాల వెల్లడి!

  • అమెరికన్లను తీవ్రంగా వేధిస్తున్న జీవన వ్యయం
  • సగానికి పైగా ప్రజల ఆందోళన ఇదేనన్న సర్వే
  • నేరాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యంపైనా తీవ్ర ఆందోళన
  • ఇతర దేశాలతో పోలిస్తే నేరాలపై అమెరికన్ల భయం ఎక్కువ
  • వాతావరణ మార్పులు, వలసలపై తక్కువ శ్రద్ధ
  • స్టాటిస్టా కన్స్యూమర్ ఇన్‌సైట్స్ సర్వేలో వెల్లడి
అమెరికా ప్రజలను ప్రస్తుతం అత్యధికంగా వేధిస్తున్న సమస్య జీవన వ్యయం. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదే మొదటి స్థానంలో ఉందని సగానికి పైగా అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాటిస్టా కన్స్యూమర్ ఇన్‌సైట్స్ అనే సంస్థ అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య దాదాపు 60,000 మందిపై జరిపిన విస్తృత సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

సర్వే వివరాల ప్రకారం, 17 కీలక అంశాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించగా, 50 శాతానికి పైగా ప్రజలు జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. దీని తర్వాత నేరాలు, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సామాజిక భద్రత, పేదరికం, గృహవసతి వంటి అంశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటిని ప్రధాన సమస్యలుగా సుమారు 40 శాతం మంది పేర్కొన్నారు. అలాగే, విద్య, వలసలు, నిరుద్యోగం, వాతావరణ మార్పులను పెద్ద సమస్యలుగా భావిస్తున్నామని దాదాపు 33 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరల నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన చాలా దేశాల్లో సాధారణంగా మారింది. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే కొన్ని అంశాల్లో అమెరికన్ల ఆందోళన భిన్నంగా ఉంది. ముఖ్యంగా నేరాల విషయంలో అమెరికన్లు (42 శాతం) ఎక్కువగా భయపడుతున్నారు. యూరప్, ఆసియా దేశాల్లో కేవలం 25 నుంచి 33 శాతం మంది మాత్రమే నేరాలను పెద్ద సమస్యగా చూస్తున్నారు.

అదే సమయంలో, వాతావరణ మార్పులపై అమెరికన్లలో ఆందోళన తక్కువగా ఉంది. కేవలం 30 శాతం మంది మాత్రమే దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రేటు 35 నుంచి 40 శాతంగా ఉంది. ప్రాధాన్యతల జాబితాలో వాతావరణ మార్పులకు అమెరికాలో 10వ ర్యాంక్ లభించగా, ఇతర దేశాల్లో ఇది 5 నుంచి 8వ స్థానంలో నిలుస్తోంది. ఇక వలసల (ఇమ్మిగ్రేషన్) అంశాన్ని అమెరికన్లు (31 శాతం) అంత పెద్ద సమస్యగా భావించడం లేదు. ఇటలీ, స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లో 40 శాతం మంది, టర్కీ (49 శాతం), చిలీ (62 శాతం)లలో ఇంకా ఎక్కువ మంది వలసలపై ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది.


More Telugu News