నిప్పులపై నడిచిన ఐఏఎస్ అధికారిణి... వీడియో ఇదిగో!

  • కర్ణాటకలోని హసనాంబ ఆలయంలో నిప్పుల గుండం తొక్కిన జిల్లా డిప్యూటీ కమిషనర్ 
  • భక్తులను చూసి స్ఫూర్తి పొందానన్న అధికారిణి లతా కుమారి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారిణి తన భక్తిని చాటుకున్నారు. హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ) కేఎస్ లతా కుమారి, ప్రసిద్ధ హసనాంబ ఆలయంలో జరిగిన అగ్నిగుండం (కెండోత్సవం) కార్యక్రమంలో పాల్గొని, నిప్పులపై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిప్పు కణికలపై ఆమె నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

హసనాంబ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా, గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా 'కెండోత్సవం' నిర్వహించారు. ఏడాది పాటు ఆలయ గర్భగుడిని మూసివేసే ముందు ఈ క్రతువును జరపడం ఆనవాయతీ. ఈ కార్యక్రమంలో డీసీ లతా కుమారి స్వయంగా పాల్గొని, కణకణలాడే నిప్పులపై చెప్పులు లేకుండా నడిచారు. గులాబీ రంగు చుడీదార్ ధరించిన ఆమె, నిప్పులపై నడుస్తున్నప్పుడు అక్కడున్న భక్తులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.

ఈ సందర్భంగా లతా కుమారి మీడియాతో మాట్లాడుతూ, "భక్తులు పవిత్ర కలశాలు పట్టుకుని నిప్పులపై నడుస్తుండటం చూసి నాకు స్ఫూర్తి కలిగింది. ఇంతకుముందెప్పుడూ నేను ఇలా నిప్పులపై నడవలేదు. మొదట కొంచెం భయపడ్డాను, కానీ దేవుడిపై విశ్వాసంతో దండం పెట్టుకుని నడిచేశాను. నాకేమీ కాలేదు" అని తెలిపారు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో 13 రోజుల పాటు జరిగిన ఈ చారిత్రక హసనాంబ జాతర మహోత్సవానికి విశేష స్పందన లభించింది. సినీ, రాజకీయ ప్రముఖులతో సహా సుమారు 26 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా ఆలయానికి దాదాపు రూ. 20 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. భక్తుల సంఖ్య, ఆదాయంపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

హసనాంబ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాది పాటు మూసి ఉంచే గర్భగుడిలో పెట్టిన నైవేద్యాలు, పువ్వులు మరుసటి ఏడాది తలుపులు తెరిచే వరకు తాజాగా ఉంటాయి. అలాగే, గర్భగుడిలోని దీపం కూడా ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు.


More Telugu News