ఏపీకి వాయుగుండం ముప్పు... అతి భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక హెచ్చరిక

  • వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
  • దక్షిణ కోస్తా, రాయలసీమకు అతి భారీ వర్షాల హెచ్చరిక
  • అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నతస్థాయి సమీక్ష
  • సిద్ధంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు ఆదేశాలు
  • ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "అత్యవసరమైతే తప్ప ఎవరూ ప్రయాణాలు చేయవద్దు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం" అని ఆమె స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్), పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ పనిచేసేలా చూడాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు 112, 1070, లేదా 18004250101 నెంబర్లను సంప్రదించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. 


More Telugu News