టీమిండియాకు ట్రోఫీ ఇవ్వని నఖ్వీ.. బీసీసీఐ గట్టి హెచ్చరిక

  • ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని బీసీసీఐ హెచ్చరిక
  • లేదంటే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామన్న బీసీసీఐ
  • అధికారిక ఈ-మెయిల్ పంపించిన బీసీసీఐ
భారత జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచి 20 రోజులు దాటినా, ట్రోఫీతో పాటు మెడల్స్ ఇంకా భారత జట్టుకు అందలేదు. దీనిపై బీసీసీఐ... ఏసీసీ చీఫ్, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీకి గట్టి హెచ్చరిక జారీ చేసింది. ట్రోఫీని సరైన పద్ధతిలో వెంటనే అప్పగించాలని, లేని పక్షంలో ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ఈ-మెయిల్ పంపింది. ఏసీసీ చీఫ్ నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ మెయిల్‌లో పేర్కొంది.

ఏసీసీ నుంచి స్పందన రాకపోతే, ఈ విషయాన్ని అధికారిక మెయిల్ ద్వారా ఐసీసీకి తెలియజేస్తామని బోర్డు కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఈ విషయంలో దశలవారీగా ముందుకు సాగుతున్నామని, ట్రోఫీని భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని స్వీకరించేందుకు భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తనతో పాటు తీసుకుపోయారు. నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్‌గా ఉన్న బీసీసీఐ, ఆసియా కప్ ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏసీసీ కార్యాలయంలో భారత జట్టుకు ట్రోఫీని అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని నఖ్వీ ఇదివరకు ప్రకటించారు. అయితే, పాకిస్థాన్ మంత్రిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉన్నట్లు సమాచారం. తన అనుమతి లేకుండా అక్కడి నుంచి ట్రోఫీని తరలించవద్దని లేదా ఇతరులకు అప్పగించవద్దని నఖ్వీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది.


More Telugu News