పుకార్లకు ఫుల్‌స్టాప్.. నిర్మాతపై ‘ఓజీ’ దర్శకుడి ప్రశంసల వర్షం

  • నిర్మాత డీవీవీ దానయ్యపై దర్శకుడు సుజీత్ ప్రశంసలు
  • సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్
  • ఇద్దరి మధ్య విభేదాలు అంటూ వస్తున్న పుకార్లు
  • రూమర్లకు చెక్ పెట్టేందుకే ఈ పోస్ట్ అని నెట్టింట చర్చ
‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌, నిర్మాత డీవీవీ దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారానికి సుజీత్ తన సోషల్ మీడియా పోస్టుతో ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని చెబుతూ, నిర్మాత దానయ్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘ఓజీ సినిమా గురించి బయట చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభం నుంచి ముగింపు వరకు నడిపించడానికి ఏం అవసరమో కొందరికి మాత్రమే అర్థమవుతుంది. ఆ విషయంలో నన్ను నమ్మి, నాకు అండగా నిలిచిన నా నిర్మాత దానయ్య గారికి, నా టీమ్‌కు మాటల్లో చెప్పలేనంతగా రుణపడి ఉంటాను’’ అని సుజీత్ తన పోస్టులో పేర్కొన్నారు.

అయితే, సుజీత్ ఉన్నట్టుండి ఈ పోస్ట్ పెట్టడం వెనుక బలమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి, సుజీత్ తన తదుపరి చిత్రాన్ని హీరో నానితో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల క్రితం ఈ ప్రాజెక్ట్ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైంది. ఈ అనూహ్య మార్పుతోనే సుజీత్‌కు, దానయ్యకు మధ్య దూరం పెరిగిందని, అందుకే నిర్మాణ సంస్థ మారిందనే పుకార్లు షికారు చేశాయి.

ఈ రూమర్లకు బలం చేకూర్చేలా ‘ఓజీ’ నిర్మాణ సమయంలోనూ ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే, తన నిర్మాతతో ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేసేందుకే సుజీత్ ఈ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘ఓజీ’ సినిమా ఈ నెల 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 


More Telugu News