మావోయిస్టు ఉద్యమంలో కలకలం.. లొంగిపోతున్నామంటూ ఏరియా కమిటీ లేఖ!

  • ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోనున్న మావోయిస్టులు
  • ఉదంతి ఏరియా కమిటీ సంచలన ప్రకటన
  • కేంద్ర కమిటీ తప్పుడు నిర్ణయాలే కారణమన్న నేత
  • లొంగిపోయేందుకు రావాలని ఇతర యూనిట్లకు పిలుపు
  • ఆయుధాలతో రావాలని లేఖలో స్పష్టమైన విజ్ఞప్తి
  • సమన్వయం కోసం సెల్ నంబర్ కూడా జారీ
మావోయిస్టు ఉద్యమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఏరియా కమిటీ మొత్తం మూకుమ్మడిగా లొంగిపోయేందుకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగా తాము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు గరియాబంద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ సునీల్ పేరుతో శుక్రవారం ఒక లేఖ విడుదలైంది.

లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం "ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. పోరాటం కొనసాగించాలంటే ముందు మనం బతికి ఉండాలి. అందుకే సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం" అని సునీల్ తెలిపారు. గోబ్రా, సినాపాలి, ఎన్‌టీకేలోని మిగతా యూనిట్లు కూడా తమ ఆయుధాలతో వచ్చి లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు అభయ్, రూపేష్ దాదా, సోనూ దాదా వంటి నేతల నిర్ణయాలను తాము సమర్థిస్తున్నట్లు ఉదంతి ఏరియా కమిటీ తెలిపింది. "కేంద్ర కమిటీ అనేక తప్పులు చేసింది. ఇప్పటికే మనం ఎంతోమంది మిత్రులను కోల్పోయాం" అని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి నిర్ణయానికి తమ యూనిట్ పూర్తి మద్దతు ఇస్తోందని సునీల్ స్పష్టం చేశారు.

లొంగిపోయే విషయంలో ఇతర సహచరులతో సమన్వయం చేసుకునేందుకు ఒక సెల్ నంబర్‌ను (93299 13220) కూడా సునీల్ ఆ లేఖలో ప్రస్తావించడం గమనార్హం. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, ఆయుధాలతో వచ్చి లొంగిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ లేఖతో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు శ్రేణుల్లో తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది.


More Telugu News