భారత్-పాక్ సరిహద్దుల్లో బండి సంజయ్ పర్యటన.. పంజాబ్ వరద బాధితులకు హామీ

  • భారీ వరదల కారణంగా నీట మునిగిన 2 వేలకు పైగా గ్రామాలు
  • వరద బాధితులను పరామర్శించిన బండి సంజయ్
  • ప్రకృతి కోపం గురుదాస్‌పూర్‌ను దెబ్బతీసిందన్న బండి సంజయ్
పంజాబ్ రాష్ట్రంలో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని గురుదాస్‌పూర్ జిల్లా నంగ్లీతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంజాబ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 2 వేలకు పైగా గ్రామాలు నీట మునిగాయి. దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. బీఎస్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వరదల వలన తీవ్రంగా నష్టపోయిన గురుదాస్‌పూర్ జిల్లాలో పర్యటించిన అనంతరం బండి సంజయ్ ఈ విషయమై 'ఎక్స్' వేదికగా స్పందించారు. నాంగ్లీతో పాటు సమీపంలోని సరిహద్దు గ్రామాల ప్రజలను కలుసుకుని, రైతులను పరామర్శించినట్లు తెలిపారు.

"కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు వచ్చారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరూ మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు" అని స్థానిక రైతులు తనతో మొరపెట్టుకున్నారని బండి సంజయ్ వెల్లడించారు.

అక్కడి రైతుల ఆవేదనలో నిజం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితిని పరిశీలించామని, విధి నిర్వహణ బాధ్యతాయుతమైనది అని పేర్కొన్నారు.

ప్రకృతి కోపం గురుదాస్‌పూర్‌ను దెబ్బతీసిందని బండి సంజయ్ పేర్కొన్నారు. వరదల కారణంగా ఇళ్లు దాదాపు 20 అడుగుల లోతు మునిగాయని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ వరదల వలన పాకిస్థాన్ పోస్టులు ధ్వంసమయ్యాయని, కానీ మన సైన్యం వరద బాధితులకు  రక్షణగా నిలిచిందని కొనియాడారు. పంజాబ్ ప్రజలను కేంద్రం ఆదుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, తాను భరోసా ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చానని బండి సంజయ్ అన్నారు. ఒక నెల రేషన్ బియ్యం, పప్పు, నూనె, మసాలా దినుసులతో కూడిన మోదీ రేషన్ కిట్‌లను కేంద్ర సహాయ మంత్రి బాధితులకు అందజేశారు. ఇది కేవలం సామగ్రి కాదని, నరేంద్ర మోదీ సందేశాన్ని ఇలా తీసుకు వచ్చానని పేర్కొన్నారు. "నేను పంజాబ్ ప్రజలను మరిచిపోలేదు" అని మోదీ ఇచ్చిన సందేశం ఇలా అందించానని అన్నారు.

ఇక్కడకు తాను మంత్రిగా రాలేదని, సోదరుడిగా వచ్చానని బాధితులతో బండి సంజయ్ అన్నారు. పంజాబ్ రైతుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంజాబ్ వరదల నేపథ్యంలో కేంద్రం రూ. 16,000 కోట్ల నిధులను విడుదల చేసిందని, రాష్ట్రం వద్ద రూ. 12,000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్, ఢిల్లీ ప్రజలకు ఒకటి చెబుతున్నాను, మోదీ, అమిత్ షా మీకు అండగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.


More Telugu News