ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళైనా కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదు: రేవంత్ రెడ్డి అసహనం

  • సీఎస్, సీఎంవో కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశం
  • కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై అసంతృప్తి
  • సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దని హితవు
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా, కొందరు అధికారుల పనితీరులో మార్పు రావడంలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులు అలసత్వం వీడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావొద్దని హితవు పలికారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే పనులు వేగవంతమవుతాయని ఆయన అన్నారు.

ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని, పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. కీలకమైన ఫైళ్లు, పనులు ఎక్కడా నిలిచిపోకూడదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టేందుకు వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఇక నుంచి అధికారులు ప్రతి వారం నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.


More Telugu News