విజయ్ సభలో తొక్కిసలాట... దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ 
  • ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలో కరూర్‌కు చేరుకున్న ఆరుగురు అధికారుల బృందం
  • సిట్ నుంచి దర్యాప్తు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు
నటుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ ప్రచార సభలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును ప్రారంభించింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సీబీఐ బృందం కరూర్‌కు చేరుకుంది. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ఏఎస్పీ ముఖేష్ కుమార్, డీఎస్పీ రామకృష్ణన్ సహా ఆరుగురు అధికారుల బృందం నిన్న అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని టూరిజం అతిథి గృహాన్ని కేంద్రంగా చేసుకొని సీబీఐ బృందం విచారణను చేపట్టింది.

ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని రికార్డులు, నివేదికలను సీబీఐ అధికారులు సిట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ దస్త్రాలను పరిశీలిస్తున్న బృందం, రాబోయే రోజుల్లో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు ఇదే క్రమంలో బాధిత కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల వాంగ్మూలాలను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు తొలుత సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. అయితే టీవీకే పార్టీ సిట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై తమకు నమ్మకం లేనందున సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరింది.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా ధర్మాసనం కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 


More Telugu News