హైదరాబాద్ శివార్లలో రేవ్‌ పార్టీ భగ్నం.. బీఆర్ఎస్ నేత సహా 33 మంది ప్రముఖుల అరెస్ట్

  • మంచాల ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ  
  • నిందితుల్లో బీఆర్ఎస్ నేత ఆనంద్‌కుమార్‌ గౌడ్, మాజీ కార్పొరేటర్‌  
  • నృత్యాల కోసం ఎనిమిది మంది యువతుల ఏర్పాటు
  • భారీగా మద్యం సీసాలు, నగదు, కార్లు, ఫోన్లు స్వాధీనం
  • అందరినీ స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు
నగర శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో బీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి సోదరుడు వంటి ప్రముఖులు ఉండటం చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు జరిపిన ఈ ఆకస్మిక దాడిలో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మంచాల మండలం లింగంపల్లి శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి, కొందరు మద్యం తాగుతూ యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో బీఆర్ఎస్ నేత చందపేట ఆనంద్‌కుమార్‌ గౌడ్ (63), గన్‌ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ (57) తో పాటు పలువురు రియల్టర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు.

కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి (49) తన స్నేహితుల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. నృత్యాల కోసం ముంబై, పశ్చిమబెంగాల్, గాజువాక ప్రాంతాల నుంచి ఎనిమిది మంది మహిళలను రప్పించాడు. ఒక్కో మహిళకు రూ. 5 వేలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీకి ఎలాంటి మద్యం అనుమతులు లేవని స్పష్టం చేశారు.

సంఘటనా స్థలం నుంచి రూ. 2.45 లక్షల నగదు, 25 సెల్‌ఫోన్లు, 11 కార్లు, 27 మద్యం సీసాలు, సౌండ్ సిస్టమ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన అందరినీ విచారణ అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. నగర శివార్లలో ప్రముఖుల ఆధ్వర్యంలో ఇలాంటి పార్టీ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది.


More Telugu News