ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం.. చాట్‌జీపీటీలో ఇకపై అడల్ట్ కంటెంట్!

  • చాట్‌జీపీటీలో ఇకపై అడల్ట్ కంటెంట్‌కు అనుమతి
  • 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఈ అవకాశం
  • కథలు, యానిమేషన్ రూపంలో ఏఐతో కంటెంట్ సృష్టి
  • ఈ డిసెంబర్ నుంచి కొత్త విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటన
  • ఎలాన్ మస్క్ ‘గ్రోక్’తో పోటీనే కారణమంటున్న విశ్లేషకులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓపెన్ఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ ద్వారా అడల్ట్ కంటెంట్ (శృంగారపరమైన) రూపొందించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన యూజర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. "పెద్దలను పెద్దలుగానే పరిగణించాలన్నది తమ సిద్ధాంతం" అని పేర్కొంటూ, ఈ ఏడాది డిసెంబర్ నుంచి యూజర్లకు ఈ తరహా కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. యూజర్లు ఇచ్చే ఆదేశాల (ప్రాంప్ట్‌ల) ఆధారంగా చాట్‌జీపీటీ కథలు, యానిమేషన్ చిత్రాలు, వీడియోల రూపంలో ఎరోటిక్ కంటెంట్‌ను సృష్టిస్తుందని ఆయన వివరించారు. అయితే, ఈ కంటెంట్‌లో ఎక్కడా నిజమైన మనుషులు ఉండరని, మొత్తం ఏఐ ద్వారానే రూపొందుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

నిజానికి శృంగారపరమైన కంటెంట్‌కు ఓపెన్ఏఐ ఇప్పటివరకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే, మార్కెట్లో నెలకొన్న పోటీ వాతావరణమే ఈ నిర్ణయానికి కారణమని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాన్ మస్క్‌కు చెందిన 'ఎక్స్ఏఐ' అభివృద్ధి చేసిన 'గ్రోక్' అనే చాట్‌బాట్ ఇప్పటికే ఈ తరహా సేవలను అందిస్తోంది. అందులోని 'గ్రోక్ ఇమాజిన్' అనే టూల్ ద్వారా యూజర్లు 3డీ యానిమేటెడ్ కంపానియన్స్‌తో శృంగార సంభాషణలు జరపడంతో పాటు, చిన్న వీడియోలు కూడా తయారుచేయవచ్చు. ఈ పోటీలో వెనుకబడకూడదనే ఉద్దేశంతోనే ఓపెన్ఏఐ ఈ కొత్త విధానాన్ని ప్రకటించిందని విమర్శలు వస్తున్నాయి.


More Telugu News