జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓట్ల అక్రమాల పిటిషన్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

  • ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ పిటిషన్
  • పిటిషన్‌ను పరిశీలిస్తున్నట్లు ఈసీ చెప్పిందన్న హైకోర్టు
  • అందుకే ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణు ముగించింది. ఈ పిటిషన్‌ను చట్ట ప్రకారం పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని, ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హైకోర్టు సీజే ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని, ఇలా 1942కు పైగా ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధం లేని 12 వేలకు పైగా ఓట్లను గుర్తించినట్లు చెప్పారు. అనుమానాస్పద ఓట్లు, బోగస్ ఓట్లు, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్ల వివరాలను ఈ నెల 13న ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని అన్నారు.

ఎన్నికల కమిషన్ తరఫున దేశాయ్ అవినాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ అని, 365 రోజుల పాటు ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణ జరుగుతూనే ఉంటుందని కోర్టుకు తెలిపారు. ఓటర్ల జాబితాను ఈ ఏడాది జులైలో ప్రచురించి అభ్యంతరాలు కోరామని, కానీ అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని కోర్టుకు తెలియజేశారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పిటిషనర్లు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ అభ్యంతరాలను పరిశీలిస్తున్న సమయంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టారు. కాబట్టి ఆ పిటిషన్ విచారణార్హం కాదని కోర్టుకు తెలియజేశారు. ఈ నెల 21వ తేదీ వరకు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లపై విచారణ ముగించినట్లు తెలిపింది. పిటిషనర్ల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఈసీ తెలిపినందున ప్రత్యేక ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది.


More Telugu News