అమెరికా రక్షణ మంత్రి విమానానికి తప్పిన పెను ప్రమాదం.. యూకేలో అత్యవసర ల్యాండింగ్

  • విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు రావడమే కారణం
  • యూకేలో సురక్షితంగా కిందకు దిగిన విమానం
  • నాటో సమావేశం నుంచి తిరిగొస్తుండగా ఘటన
అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రయాణిస్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆయన విమానాన్ని యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం హెగ్సెత్ అమెరికాకు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో విమానం గాల్లో ఉండగా దాని విండ్‌షీల్డ్‌లో పగుళ్లు ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు, విమానాన్ని సమీపంలోని యూకే విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ విషయాన్ని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ ధ్రువీకరించారు. మంత్రి హెగ్సెత్‌తో పాటు విమానంలోని వారంతా క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు జరిగిన నాటో సమావేశంలో మంత్రి హెగ్సెత్, రష్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌పై మాస్కో దూకుడును ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. రష్యా తన వైఖరి మార్చుకోకపోతే అమెరికా, దాని మిత్రపక్షాలు కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నాటో కూటమి కట్టుబడి ఉందని కూడా ఆ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. 


More Telugu News