ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా ఆల్ రౌండర్ జడేజా

  • ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానంపై క్రికెటర్ జడేజా స్పందన
  • జాతి నిర్మాణంలో సంఘ్ పాత్ర కీలకమని వ్యాఖ్య
  • ఆర్ఎస్ఎస్ శాఖల వల్లే మోదీ వంటి నేతలు తయారయ్యారని వెల్లడి
  • సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్‌తో తన భేటీని గుర్తు చేసుకున్న జడేజా
  • లక్షలాది మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్
  • దేశ సంస్కృతిని కాపాడేందుకే సంఘ్ పుట్టిందని పేర్కొన్న ఆల్రౌండర్
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని జడేజా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దానికి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే గొప్ప ఉదాహరణ అని అభిప్రాయపడ్డాడు.

ఈ సందర్భంగా జడేజా 'ఎక్స్' లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. "స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్ పాలన, ఇతర భావజాలాల కారణంగా మన దేశ ఆత్మ, సంస్కృతి దెబ్బతిన్నాయి. ఈ సంస్కృతి నాశనమైతే జరిగే తీవ్ర పరిణామాలపై ఆందోళనతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పుట్టింది" అని పేర్కొన్నాడు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దేశ సంస్కృతిని, దేశాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంతో సంఘ్‌ను స్థాపించారని, ఆ ప్రయాణం ఇప్పుడు 100 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపాడు.

"శీల నిర్మాణం ద్వారా వ్యక్తి నిర్మాణం అనేదే సంఘ్ తొలి అడుగు. శాఖల ద్వారా దేశభక్తి, అంకితభావం గల యువతను తీర్చిదిద్దే పని ప్రారంభమైంది" అని జడేజా వివరించాడు. ఈ వందేళ్లలో సంఘ్ పరివార్ విద్య, ఆరోగ్యం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో గణనీయమైన సేవలు అందించిందని కొనియాడారు. సంఘ్ శాఖల్లో ఎదిగిన ఎంతో మంది జాతి నిర్మాణంలో పాలుపంచుకున్నారని, అందుకు మన ప్రధాని నరేంద్ర భాయ్ మోదీనే నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశాడు.

కొంతకాలం క్రితం తాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కలిసిన విషయాన్ని కూడా జడేజా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఆ భేటీలో ఆయన మాటలు మన సంస్కృతి యొక్క లోతును, సమకాలీన సమస్యలకు పరిష్కారాలను ప్రతిబింబించాయని, ఈ అనుభవం సంఘ్ పట్ల తన గౌరవాన్ని మరింత పెంచిందని తెలిపాడు. ఈ వందేళ్ల నిరంతర ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా లక్షలాది మంది సంఘ్ కార్యకర్తలకు జడేజా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశాడు.

జడేజా భార్య రివాబా బీజేపీ ఎమ్మెల్యే అని తెలిసిందే. 2019లో బీజేపీలో చేరిన ఆమె 2022 ఎన్నికల్లో గుజరాత్ లోని జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.


More Telugu News