పాకిస్థాన్ మరోసారి దాడికి ప్రయత్నం చేయవచ్చు: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్

  • పహల్గామ్ తరహా దాడికి ప్రయత్నించవచ్చన్న కటియార్
  • భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని స్పష్టీకరణ
  • పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదన్న కటియార్
పాకిస్థాన్ మరో దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌లో ఆయన మాట్లాడుతూ, పహల్గామ్ తరహాలో పాకిస్థాన్ మరో దాడికి ప్రయత్నిస్తే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టిగా బదులిచ్చినప్పటికీ పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు.

పాకిస్థాన్ ప్రతి కదలికపై దృష్టి సారించామని మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈసారి అలాంటి దుశ్చర్యకు పాల్పడితే మనం ఇచ్చే సమాధానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే ఈసారి గట్టి గుణపాఠం చెబుతామని భారత సైన్యం గత నెలలోనే స్పష్టం చేసింది.

ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌కు సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన వారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాద నిర్మూలనకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది.


More Telugu News