Dasoju Shravan: తెలుగుదేశం పార్టీ వారికి రేవంత్ రెడ్డి అలా చెప్పడం రౌడీ మాదిరిగా పిలుపునివ్వడమే!: దాసోజు శ్రవణ్

Dasoju Shravan Slams Revanth Reddys Call to TDP Workers
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య వైషమ్యాలకు దారితీస్తున్నాయని ఆగ్రహం
  • కేసీఆర్‌ను 100 మీటర్ల లోతున బొంద పెడతానంటే కేసు పెట్టవద్దా అని ప్రశ్న
  • రాహుల్ గాంధీ పుణ్యమా అని రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారాడని ఆగ్రహం
బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం రెండు పార్టీల మధ్య వైషమ్యాలకు దారితీస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని అన్నారు. రేవంత్ రెడ్డిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య గొడవలకు, వైషమ్యాలకు దారి తీస్తాయని అన్నారు. ముక్కలు అవుతారని అన్నందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసు పెట్టారని, మరి కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలన్న రేవంత్ రెడ్డిపై కేసు పెట్టకూడదా అని ప్రశ్నించారు.

నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. నిరంతర పోరాటంతో తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను, తెలంగాణ సాధన కోసమే పుట్టిన బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతున బొంద పెట్టాలని పిలుపునివ్వడం విడ్డూరమని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన, 1,200 మంది ఉద్యమకారులను బలితీసుకున్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతికి బట్టకట్టాలని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్, కేసీఆర్ ఉండకూడదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది మనుషులు మాట్లాడే భాషనా, రాక్షసుల భాషనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతి రెచ్చగొట్టేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై సుమోటోగా కేసు పెట్టాలని కోరామని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని అన్నారు.

"బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి తొలగించాలని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చారు. అలా పిలుపునివ్వడం ద్వారా బీఆర్ఎస్, టీడీపీల మధ్య, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణం ప్రేరేపించేలా కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం ఆయన మాట్లాడిన మాటలు దారుణం. కంచె చేను మేసినట్లుగా ఆయన అలా మాట్లాడటం దుర్మార్గం, శోచనీయం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడిలా మాట్లాడటం భారతదేశంలో ఎవరూ మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ పుణ్యమా అని తెలంగాణ పాలిట శాపంగా రేవంత్ రెడ్డి మారారు. తన నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు" అని తీవ్రంగా విమర్శించారు.
Dasoju Shravan
Revanth Reddy
BRS
Telangana
TDP
KCR
Telangana Politics
Khamma
Mahesh Bhagwat

More Telugu News