Madhav: విజయసాయి ట్వీట్ పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ స్పందన
- వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందన్న మాధవ్
- అక్రమాలకు పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని వ్యాఖ్య
- బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి వచ్చామన్న మాధవ్
ఏపీ రాజకీయాల్లో త్వరలోనే సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం లిక్కర్ అవినీతికి మాత్రమే పరిమితం కాకుండా అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వారెవరికైనా తప్పకుండా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతోందని వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు.
అనంతరం పార్టీ విషయాలపై మాట్లాడుతూ, బీజేపీలో మూడేళ్లకు ఒకసారి జాతీయ అధ్యక్షుడు మారే సంప్రదాయం ఉందని చెప్పారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ బీజేపీ అని, దేశవ్యాప్తంగా పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో తాము ఢిల్లీకి వచ్చామని వివరించారు.
నితిన్ నబీన్‌కు మద్దతుగా ఏపీ బీజేపీ తరఫున రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నామని మాధవ్ తెలిపారు. ఒక్కో సెట్లో 20 మంది సభ్యులు ఉండేలా నామినేషన్లు వేస్తున్నామని చెప్పారు. మరోవైపు, ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 నుంచి 6 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అనంతరం, సాయంత్రం 6 గంటలకు పార్టీ జాతీయ కొత్త అధ్యక్షుడి పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటిస్తుంది. ఒకవేళ ఏకగ్రీవం అయితే, నిర్ణీత సమయం కంటే ముందే ప్రకటించే అవకాశం ఉంది.
విజయసాయిరెడ్డి ట్వీట్: విజయసాయిరెడ్డి తన తాజా ట్వీట్ ను వైసీపీ కోటరీని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేశారు.