CV Anand: అసలేం జరుగుతోంది...? టీమిండియా ఓటమిపై సీవీ ఆనంద్ ట్వీట్ వైరల్

CV Anand tweet on Indias loss to New Zealand goes viral
  • నిన్న మూడో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
  • 2-1తో సిరీస్ చేజిక్కించుకున్న కివీస్
  • భారత క్రికెట్ లో ఏం జరుగుతోందంటూ ఘాటుగా ప్రశ్నించిన సీవీ ఆనంద్
టీమిండియా ప్రదర్శనపై తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. "భారత క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

నిన్న జరిగిన మూడో వన్డేలో ఓటమితో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో న్యూజిలాండ్‌కు సమర్పించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో కివీస్ చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే స్పందించిన సీవీ ఆనంద్, గత ఏడాది టెస్టు సిరీస్‌లోనూ 0-3 తేడాతో ఓడిపోయామన్న విషయాన్ని గుర్తుచేశారు.

"ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 1-2 తేడాతో ఓడిపోయింది. చరిత్రలో ఇది తొలిసారి! గతేడాది మన సొంత గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ మనల్ని 3-0 తేడాతో ఓడించింది. అదీ చరిత్రలో మొదటిసారే!!

భారత క్రికెట్‌లో అసలు ఏం జరుగుతోంది??

ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు మనది. టీ20లు, వన్డేలు, లాంగ్ ఫార్మాట్‌లను కవర్ చేస్తూ ఏడాది పొడవునా దేశవాళీ క్రికెట్ వ్యవస్థ ఉంది. అపారమైన ప్రతిభ అందుబాటులో ఉంది! అయినా, మధ్యలో ఒక టీ20 ప్రపంచ కప్ గెలవడం మినహా మనం అన్నీ కోల్పోతున్నట్లు అనిపిస్తోంది!

దీనికి కారణం ఐపీఎల్ డబ్బా? ఆటగాళ్లలో టెంపర్‌మెంట్ లోపమా? పక్షపాతంతో కూడిన సెలక్షన్లా? లేక గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉండటమా?" అంటూ ట్వీట్ చేశారు.
CV Anand
India vs New Zealand
India cricket
New Zealand series
Cricket series loss
Indian cricket team
T20 World Cup
Gautam Gambhir
IPL
Cricket selection

More Telugu News