Nasser Hussain: ఆ భయం పోయింది... విదేశీ క్రికెటర్లలో ఐపీఎల్ తెచ్చిన మార్పు ఇదే: నాసర్ హుస్సేన్

Nasser Hussain on IPL impact on foreign cricketers
  • భారత గడ్డపై ఇతర జట్లు ప్రేక్షకులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హుస్సేన్
  • ఐపీఎల్ ద్వారా విదేశీ ఆటగాళ్లలో ఆ భయం పోయిందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ 
  • ఇక్కడి పరిస్థితులకు విదేశ్రీ కికెటర్లు అలవాటు పడ్డారని వెల్లడి
భారత గడ్డపై అశేష అభిమానుల మధ్య క్రికెట్ ఆడటమంటే ఒకప్పుడు విదేశీ ఆటగాళ్లకు పెద్ద సవాల్‌గా ఉండేదని, కానీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పుణ్యమా అని ఆ పరిస్థితి మారిపోయిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక వేదికలుగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచకప్‌ను ఉద్దేశించి అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

జియోస్టార్ కార్యక్రమంలో హుస్సేన్ మాట్లాడుతూ.. "భారత్‌లో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టు కేవలం ఆటగాళ్లతోనే కాదు, అభిమానులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో టీమిండియా జోరందుకుంటే, ఇతర జట్లు ఆ ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. అయితే ఐపీఎల్ కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లకు ఇక్కడి స్టేడియాలు, వాతావరణం, ఒత్తిడిపై పూర్తి అవగాహన వచ్చింది. మా రోజుల్లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు వస్తుంటే, అభిమానుల స్పందనకు బౌలర్ల కళ్లలో భయం కనిపించేది. కానీ ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల ఆ భయం పోయింది" అని వివరించాడు.

ఇదే చర్చలో పాల్గొన్న భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా స్పందించాడు. అభిమానుల ఒత్తిడిని తట్టుకునే విషయంలో భారత జట్టులో కూడా మార్పు వచ్చిందని అన్నాడు. "1996 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో మన జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. కానీ 2011 ప్రపంచకప్‌లో గ్యారీ కిర్‌స్టన్, ప్యాడీ అప్టన్ ఆధ్వర్యంలో ఈ ఒత్తిడిని ఒక అదనపు బలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టారు. అభిమానుల మద్దతును స్ఫూర్తిగా తీసుకోవాలని సచిన్ కూడా చెప్పారు. 2023 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు అభిమానుల శక్తిని ఉపయోగించుకుని అద్భుతమైన క్రికెట్ ఆడింది" అని కార్తీక్ గుర్తు చేసుకున్నాడు.


Nasser Hussain
IPL
Indian Premier League
T20 World Cup 2026
Dinesh Karthik
Sachin Tendulkar
India cricket
Cricket fans
Gary Kirsten
Paddy Upton

More Telugu News