హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

  • బాలానగర్‌లో విషాద ఘ‌ట‌న‌
  • ఇద్దరు కవల పిల్లలను చంపిన తల్లి
  • అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
  • కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని మరిచిన ఓ తల్లి, తన ఇద్దరు కవల పిల్లలను అత్యంత దారుణంగా హతమార్చి, ఆ తర్వాత తాను కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలానగర్‌లోని పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి అనిల్ కుమార్, సాయిలక్ష్మీ (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల వయసున్న కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిలక్ష్మీ, తన ఇద్దరు పిల్లలను చంపివేసింది. అనంతరం తాను నివసిస్తున్న భవనం పైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు విడిచింది.

పెద్ద శబ్దం రావడంతో గమనించిన స్థానికులు, రక్తపు మడుగులో పడి ఉన్న సాయిలక్ష్మిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి చలించిపోయారు. కుటుంబ వివాదాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News