ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్

  • ఏ22 నిందితుడు చైతన్య బాబుకు రిమాండ్
  • 15కి చేరిన అరెస్టుల సంఖ్య, మరో 8 మంది పరారీ
  • కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించిన ప్రభుత్వం
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే, ఈ కేసులో 22వ నిందితుడిగా ఉన్న చైతన్య బాబును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ అరెస్టుతో ఇప్పటివరకు పట్టుబడిన వారి సంఖ్య 15కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని, విచారణలో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కేసు దర్యాప్తు బాధ్యతలను సిట్ స్వీకరించడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిలో ఆందోళన మొదలైంది.

ఇదే కేసులో 17వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. 


More Telugu News