రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు... పిల్లి!: హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

  • సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు, పిల్లి అని హరీశ్ రావు ఎద్దేవా
  • ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుపై సీఎం మౌనం వహించడంపై తీవ్ర విమర్శ
  • కర్ణాటకకు వెళ్లినా కృష్ణా జలాల గురించి మాట్లాడలేదని ఆరోపణ
  • ఢిల్లీకి బ్యాగులు మోయడమే రేవంత్ పని అంటూ సెటైర్
  • పొరుగు రాష్ట్రాలు నీళ్లు ఆపుకుంటే మన పరిస్థితి ఏంటని ప్రశ్న
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు... నల్లమల పిల్లి" అని ఆయన ఘాటుగా విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ఇటీవల కర్ణాటకకు వెళ్లిన రేవంత్ రెడ్డి, అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ఎందుకు మాట్లాడలేదని హరీశ్ రావు నిలదీశారు. "ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్న కనీస సోయి రేవంత్ రెడ్డికి లేదు. సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో రాహుల్ గాంధీ ద్వారా ఒక్క ఫోన్ కూడా చేయించలేని స్థితిలో ఆయన ఉన్నారు" అని విమర్శించారు. ఢిల్లీకి బ్యాగులు మోయడమే కాకుండా, రాష్ట్ర బాగోగులను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు.

పొరుగు రాష్ట్రాల నీటి వినియోగంపై హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. "ఏపీ 463 టీఎంసీలు, కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీల నీటిని ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి? కింద గోదావరి, పైన కృష్ణా నీళ్లు వాళ్లు తీసుకుపోతే మన బతుకులు ఏం కావాలి?" అని ఆయన ప్రశ్నించారు.

తరచూ తనను తాను ‘నల్లమల బిడ్డ’ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నల్లమలను ఆనుకుని ప్రవహించే కృష్ణా నదికి, మహబూబ్ నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. "నువ్వు నల్లమల పులివా, పిల్లివా, ఎలుకవా? పులి అయితే గర్జించేవాడివి. పిల్లివి, ఎలుకవు కాబట్టే మౌనంగా ఉన్నావు" అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.


More Telugu News