అల్లు అర్జున్ సినిమా ఓ ప్రయోగం... ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తా: దర్శకుడు అట్లీ

  • బెంగళూరులో ఓ ఈవెంట్‌లో మీడియా ముందుకు అట్లీ 
  • ఇది సాధారణ సినిమా కాదని వ్యాఖ్య 
  • ప్రేక్షకుల చూసే విధానాన్ని మారుస్తుందంటూ ధీమా
  • కొత్త అనుభూతిని ఇవ్వడమే లక్ష్యమని వెల్లడి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే జంటగా ప్ర‌ముఖ‌ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అట్లీ చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. తమ చిత్రం ఒక సాధారణ సినిమా కాదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సరికొత్త దారిని తామే సృష్టిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అట్లీ, ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. తన తదుపరి చిత్రం ‘AA22xA6’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. "సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ఇది అందరూ తీసే రొటీన్ సినిమా కాదు. ఈ జానర్‌కు ప్రత్యేకమైన రూల్స్ ఏవీ లేవు, అందుకే మేమే ఒక కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నాం. ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం" అని ఆయన వివరించారు.

ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం రిస్క్ కాదా? అని మీడియా ప్రశ్నించగా, అట్లీ ఆసక్తికరంగా స్పందించారు. "ఇది నాకు రిస్క్ అనిపించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు సంపూర్ణంగా కొత్తదనాన్ని పంచుతుంది. వారి ఆలోచనా విధానాన్ని, సినిమా చూసే పద్ధతిని మార్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అంటూ ధీమాను వ్యక్తం చేశారు.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అద్భుతమైన విజువల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు అట్లీ తెలిపారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నామని, మరిన్ని వివరాలను రానున్న నెలల్లో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News