ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం.. ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు

  • ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు ఒకే గొడుగు కిందకు
  • విలీన ప్రక్రియ కారణంగా ఐదు రోజుల పాటు సేవలకు అంతరాయం
  • ఈ నెల 9న‌ సాయంత్రం 6 నుంచి 13 ఉదయం 10 వరకు లావాదేవీలు బంద్
  • ఏటీఎం, యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిపివేత
  • ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు బ్యాంకు సూచన
ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు ఇది ముఖ్యమైన వార్త. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు కీలక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది. సాంకేతిక అనుసంధాన పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే... ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులను కలిపి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు'గా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు బ్యాంకుల డేటాను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నెల‌ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

ఈ ఐదు రోజుల వ్యవధిలో బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్ వంటి ఆన్‌లైన్ సేవలు కూడా పనిచేయవని బ్యాంకు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో అక్టోబర్ 11 (రెండో శనివారం), 12 (ఆదివారం) బ్యాంకులకు సెలవులు అయినప్పటికీ, సాధారణంగా పనిచేసే ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవని పేర్కొంది.

ఈ ప్రక్రియ వల్ల ఖాతాదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. సేవల్లో అంతరాయం ఏర్పడనున్నందున, ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. అవసరమైన నగదు విత్‌డ్రాలు, ఇతర పనులను ఈ నెల‌ 9వ తేదీ సాయంత్రం 6 గంటలలోపే పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విలీనం పూర్తయిన తర్వాత ఖాతాదారులకు మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందిస్తామని బ్యాంకు హామీ ఇచ్చింది.


More Telugu News