విశాఖలో నేడు హోరాహోరీ.. దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ

  • మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మూడో మ్యాచ్
  • విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
  • వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా
  • ఆందోళన కలిగిస్తున్న కెప్టెన్ హర్మన్, స్మృతి మంధాన ఫామ్
  • విశాఖలో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ భారత్‌దే విజయం
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు, నేడు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో శ్రీలంక, పాకిస్థాన్‌పై గెలిచినప్పటికీ, ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు దిగుతోంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఈ ఆసక్తికర సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయం సాధించి, సెమీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

కంగారు పెడుతున్న స్టార్ల ఫామ్..
గత రెండు మ్యాచుల్లో భారత్ గెలిచినా, బ్యాటింగ్ విభాగంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వంటి కీలక క్రీడాకారిణులు ఇప్పటివరకు పెద్దగా రాణించలేదు. అయితే, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్ వంటి మిగతా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం జట్టుకు ఊరటనిస్తోంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే స్టార్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం అత్యంత కీలకం.

మరోవైపు భారత బౌలింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. పేసర్ క్రాంతి గౌండ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి కూడా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. విశాఖ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరు ఈ మ్యాచులో కీలక పాత్ర పోషించవచ్చు. ఇక, దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌తో ఓడినా, రెండో మ్యాచులో న్యూజిలాండ్‌పై భారీ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇలా..
ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 33 వన్డేలు జరగ్గా, భారత్ 20 విజయాలతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా 12 సార్లు గెలిచింది. విశేషమేమిటంటే, విశాఖ గడ్డపై భారత మహిళల జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు వన్డేల్లోనూ టీమిండియా విజయం సాధించడం గమనార్హం. ఈ రికార్డును కొనసాగించి, టోర్నీలో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని జట్టు ఉవ్విళ్లూరుతోంది.


More Telugu News