ఎన్ని జన్మలు ఎత్తినా జగన్ తన లిక్కర్ స్కాం పాపాలు కడుక్కోలేడు: సోమిరెడ్డి

  • కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న సోమిరెడ్డి
  • వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల మద్యం స్కాం జరిగిందని ఆరోపణ
  • నాణ్యతలేని 'జే బ్రాండ్ల'తో వేలమంది ప్రాణాలు తీశారని విమర్శ
  • ప్రస్తుత కూటమి ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని వెల్లడి
  • జగన్ లాంటి పచ్చి అబద్ధాలకోరు రాజకీయాల్లో లేరని వ్యాఖ్య
మాజీ ముఖ్యమంత్రి జగన్ కల్తీ మద్యం గురించి మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించడం ఒక్కటేనని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు నేరగాళ్లకు కొమ్ముకాసి, అరాచకాలకు పాల్పడిన ఆయన ఎన్ని జన్మలెత్తినా తన లిక్కర్ స్కాం పాపాలను కడుక్కోలేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, "వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రూ.3,500 కోట్ల విలువైన భారీ మద్యం కుంభకోణం జరిగింది. నాణ్యత లేని 'జే బ్రాండ్ల' మద్యాన్ని ప్రజలపై బలవంతంగా రుద్ది, వేలాది మంది ప్రాణాలతో చెలగాటమాడారు. లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారు?" అని ప్రశ్నించారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు మొత్తం వారి చేతుల్లో పెట్టుకుని వేల కోట్లు దండుకున్నారని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం విధానంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. "ప్రజలకు నచ్చిన బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాం. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాం" అని ఆయన వివరించారు.

"ప్రపంచ రాజకీయ చరిత్రలో మీలా ఇంత పచ్చి అబద్ధాలు ఆడే మరొక నాయకుడు ఉండడు... ఉండబోడు. క్యాష్ అండ్ క్యారీ సిస్టమ్ తో జే బ్రాండ్ మద్యమే తాగాలనే కండీషన్ పెట్టి, వేల మంది ప్రాణాలను తీసి, లక్షల మందిని ఆసుపత్రి మంచమెక్కించావు... మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ప్రజల బుడ్డ ముంచావ్.

మద్యం తయారీ, సరఫరా, అమ్మకం ఇలా అన్ని విభాగాలను నీ చేతిలో పెట్టుకుని వేలకోట్ల నోట్లకట్టలతో డంపు పెట్టుకున్న మీరా మాట్లాడేది? నకిలీ మద్యం సమాచారం అందగానే దాడులు చేసిందీ, అరెస్టులు చేసింది మేమే...ఆ రోపణలు ఎదుర్కొంటున్న వారిని సస్పెండ్ చేసిందీ మేమే.? ఇదీ చట్టం పట్ల, ప్రజారోగ్యం పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి" సోమిరెడ్డి ఉద్ఘాటించారు. 


More Telugu News