రిషబ్ శెట్టి కష్టానికి నిదర్శనమే 'కాంతార చాప్టర్1'

  • గతంలో ఘనమైన విజయాన్ని సాధించిన 'కాంతార'
  • రిషబ్ శెట్టిని నిలబెట్టిన సినిమా 
  • ప్రీక్వెల్ గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1'
  • 5 రోజులలో 350 కోట్లకి పైగా వసూళ్లు 
  • 500 కోట్ల మార్క్ దిశగా పరుగులు  

ఏ రంగంలోనైనా ఎదగాలంటే కష్టపడవలసిందే. అయితే ఆ కష్టాన్ని గుర్తించేవాళ్లు .. ఆదరించేవాళ్లు .. ప్రోత్సహించేవాళ్లు కావాలి. ఆ రోజు వచ్చేవరకూ వెయిట్ చేయగలగాలి. కల కనడం తేలికనే .. కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి ఒక జీవితకాలమే పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ పట్టుదలతో అనుకున్నది సాధించేవాళ్లు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది జాబితాలో ఇప్పుడు రిషబ్ శెట్టి కూడా చేరిపోయాడు అనడానికి నిదర్శనం, 'కాంతార చాప్టర్ 1' సాధించిన విజయమనే చెప్పాలి.       

రిషబ్ శెట్టి కెరియర్ కూడా చాలా సాధారణంగానే మొదలైంది. 2012లో ఇండస్ట్రీకి  వచ్చిన దగ్గర నుంచి ఆయన అవకాశాలను వృథా చేయలేదనే విషయం అర్థమవుతుంది. నటుడిగా .. దర్శకుడిగా .. నిర్మాతగా .. ఇలా ఎదగడానికి ఏ వైపు నుంచి అవకాశం ఉన్నా వదలకుండా ఆయన ప్రయత్నించడం కనిపిస్తుంది. ఏ హీరోకైనా తనకి గుర్తుండిపోయే హిట్ పడటం వేరు, ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ పడటం వేరు. అలాంటి హిట్ ను ఆయన 'కాంతార చాప్టర్ 1'తో అందుకోవడం విశేషం. 

'కాంతార' సినిమాను 16 కోట్లతో నిర్మిస్తే 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి నిర్మాతలను ఒప్పించి, ప్రీక్వెల్ కోసం 125 కోట్లు ఖర్చు పెట్టించడం తాను సాధించుకున్న నమ్మకమేనని చెప్పాలి. 5 రోజులలోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. ఈ వారాంతానికి 500 కోట్ల మార్కును టచ్ చేయవచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 'కాంతార' అనేది ఒక కథగా .. ఒక విజయంగా మాత్రమే కాదు, రిషబ్ శెట్టి పడిన కష్టానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. 



More Telugu News