వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే వెళ్ళిపోయిన 11 మంది భారత క్రికెట్ దిగ్గజాలు వీరే!

  • వీడ్కోలు మ్యాచ్ ఆడకుండానే రిటైరైన భారత క్రికెట్ దిగ్గజాలు
  • జాబితాలో ధోనీ, యువరాజ్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి స్టార్లు
  • అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోయిన ఆఖరి మ్యాచ్
భారత క్రికెట్ జట్టులో దిగ్గజ ఆటగాళ్లుగా వెలుగొందుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, ఒక ఆసక్తికరమైన చర్చ మళ్లీ తెరపైకి వస్తోంది. దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఎందరో స్టార్ క్రికెటర్లు, కనీసం ఒక్క వీడ్కోలు మ్యాచ్ కూడా ఆడకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించడం అభిమానులను ఎప్పుడూ వేధించే విషయమే. మైదానంలో తమ హీరోలను ఆఖరిసారిగా చూడాలన్న కోరిక తీరకుండానే, వారు ఆటకు వీడ్కోలు పలకడం ఒకరకమైన వెలితిని మిగిల్చింది.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించే. 2020 ఆగస్టులో కరోనా లాక్‌డౌన్ సమయంలో ధోనీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌కు ఘనమైన వీడ్కోలు దక్కలేదన్న బాధ అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. అలాగే, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ కూడా 2019లో ఆటకు గుడ్ బై చెప్పాడు. తనకు ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా, వద్దని చెప్పడం గమనార్హం. 'ది వాల్' రాహుల్ ద్రావిడ్, 'వెరీ వెరీ స్పెషల్' వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారు కూడా 2012లో ఎలాంటి హడావుడి లేకుండా మీడియా సమావేశం ద్వారానే తమ రిటైర్మెంట్ నిర్ణయాలను వెల్లడించారు.

విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2013లో జట్టుకు దూరమై, 2015లో అధికారికంగా రిటైరయ్యాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌ల విజయంలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ కూడా 2018లో ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండానే తప్పుకున్నాడు. బౌలింగ్ దిగ్గజాలైన అనిల్ కుంబ్లే (2008), జహీర్ ఖాన్ (2015), హర్భజన్ సింగ్ (2021) కూడా ఇదే బాటలో నడిచారు. గాయాలు, జట్టులో మార్పుల కారణంగా వీరికి మైదానంలో ఘనమైన వీడ్కోలు దక్కలేదు. ఇక, అత్యుత్తమ ఫీల్డర్, ఫినిషర్‌గా పేరుగాంచిన సురేశ్ రైనా సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

ఇటీవల, 2024 ఆగస్టులో ఐసీసీ టోర్నీల హీరోగా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఇలా ఎందరో దిగ్గజాలు వీడ్కోలు మ్యాచ్ ఆడకపోయినా, భారత క్రికెట్‌కు వారు అందించిన సేవలు, సాధించిన విజయాలు మాత్రం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. 


More Telugu News