జూబ్లీహిల్స్‌లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది: హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి

  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు తొలగిస్తామన్న ఎన్నికల అధికారి
  • కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్న ఆర్వీ కర్ణన్
  • కోడ్ ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టీకరణ
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనందున, హైదరాబాద్ వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని ఆయన వెల్లడించారు.

నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందని, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్ నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్తగా నమోదు చేసుకునేందుకు మరో పది రోజుల సమయం ఉందని ఆయన వివరించారు.

139 పోలింగ్ ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని నగర కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News