ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరోసారి కేసు నమోదు

  • మధ్యప్రదేశ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రసంగం వీడియో
  • మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యువకుల ఫిర్యాదు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనపై హైదరాబాద్‌లోని శాలిబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.

ఈ వీడియోను చూసిన హైదరాబాద్ ఫతే దర్వాజ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు.. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ తన వ్యాఖ్యల కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. గతంలో ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే ఆయనపై బీజేపీ అధిష్ఠానం బహిష్కరణ వేటు వేసింది.  


More Telugu News