కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ, జనసేన నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు!

  • కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో మలుపు
  • వైసీపీ, జనసేన నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు
  • ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని ఆరోపణ
  • సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆవేదన
  • సైలెంట్‌గా ఉండాలంటూ నేతలు ఒత్తిడి చేశారని వెల్లడి
తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గతంలో కిరణ్ రాయల్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డి, ఇప్పుడు పలువురు వైసీపీ, జనసేన నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేత సురేశ్, అతనికి సహకరించిన జనసేన నాయకులు దినేశ్ జైన్, గని, హరిశంకర్ తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని లక్ష్మీరెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న మార్ఫింగ్ కంటెంట్‌ను తొలగించాలని తాను పలుమార్లు కోరినా వారు పట్టించుకోలేదని తెలిపారు. "సమయం వచ్చినప్పుడు డిలీట్ చేస్తాం, ప్రస్తుతానికి నువ్వు సైలెంట్‌గా ఉండు" అని ఆ నేతలు తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

గతంలో కిరణ్ రాయల్ తన వద్ద రూ. 1.20 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదని లక్ష్మీరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత కిరణ్ రాయల్‌తో తన ఆర్థిక లావాదేవీల వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు ఆమె ప్రకటించారు. తన కుటుంబ సమస్యల వల్లే తాను బయటకు వచ్చానని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని అప్పుడే ఆమె ఆరోపించారు.

తాజాగా తన వ్యక్తిగత సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఈ తాజా ఫిర్యాదుతో కిరణ్ రాయల్ వ్యవహారం మరోసారి తిరుపతి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News