ఇష్టమైనవి తింటూనే బరువు ఎలా తగ్గానంటే: అసలు రహస్యం చెప్పిన రాశి ఖన్నా

  • తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న నటి రాశి ఖన్నా
  • బరువు తగ్గేందుకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోలేదన్న బ్యూటీ
  • తినే పరిమాణాన్ని తగ్గించుకోవడమే తన సీక్రెట్ అని వెల్లడి
  • ఒకప్పుడు లావుగా ఉండేదాన్నని అంగీకారం
  • రోజూ జిమ్, యోగా తన జీవితంలో భాగమైపోయాయన్న రాశి
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి రాశి ఖన్నా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బరువు తగ్గేందుకు చాలామంది కఠినమైన డైట్ నియమాలు పాటిస్తుంటే, తాను మాత్రం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే స్లిమ్‌గా మారానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న రహస్యాన్ని రాశి వివరించారు.

చిన్నప్పటి నుంచి తాను ఆహారాన్ని బాగా ఇష్టపడతానని, పరాఠాలు వంటివి ఎక్కువగా తినడం వల్ల కాస్త బొద్దుగా ఉండేదాన్నని రాశి గుర్తుచేసుకున్నారు. "సినిమాల్లోకి అడుగుపెట్టాక, తెరపై అందంగా కనిపించాలంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరి అని అర్థమైంది. నాక్కూడా నేను లావుగా కనిపిస్తున్నాననిపించింది. అందుకే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె తెలిపారు. అయితే, ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, నెమ్మదిగా బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

తన డైట్ గురించి మాట్లాడుతూ, "బరువు తగ్గే క్రమంలో నేను నా ఆహారపు అలవాట్లను మార్చుకోలేదు. చిన్నప్పటి నుంచి ఏవి తింటూ పెరిగానో, అవే ఇప్పటికీ తింటున్నాను. కానీ, ఒకేసారి ఎక్కువగా తినకుండా, కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకున్నాను. ఈ చిన్న మార్పు వల్లే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బరువును అదుపులో ఉంచుకోగలుగుతున్నాను" అని రాశి ఖన్నా వివరించారు.

ఫిట్‌నెస్ కోసం రోజూ క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం తన జీవితంలో ఒక భాగమైపోయిందని ఆమె అన్నారు. "ప్రతిరోజూ వర్కౌట్లు, యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా అనిపిస్తుంది" అని పేర్కొన్నారు. ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘యోధ’ చిత్రంలో నటించిన రాశి, ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.


More Telugu News