ఇక మాడ్లాడుకోవడాలు లేవు... లొంగిపోవడమే!: మావోయిస్టులకు తేల్చిచెప్పిన అమిత్ షా

  • మావోయిస్టులతో చర్చలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేవన్న అమిత్ షా
  • లొంగిపోతారా లేక కూంబింగ్ ఎదుర్కొంటారా అంటూ వ్యాఖ్యలు 
  • నక్సలిజం నిర్మూలనకు 2026 మార్చి 31 డెడ్‌లైన్ అని వెల్లడి
  • గ్రామాలను నక్సల్ ఫ్రీ చేస్తే కోటి రూపాయల అభివృద్ధి నిధులు
  • గడిచిన నెలలోనే 500 మంది మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆయుధాలు వీడి లొంగిపోవడం లేదా భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్లను ఎదుర్కోవడం మినహా వారికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు 2026 మార్చి 31వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.

దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు బస్తర్ వచ్చిన అమిత్ షా, జగదల్‌పూర్‌లో జరిగిన ఒక సభలో మాట్లాడారు. ఇటీవల మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటూ కరపత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "దేశంలోనే అత్యుత్తమ పునరావాస విధానం అమలులో ఉంది. గత పదేళ్లలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి కోసం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. చర్చల్లో మాట్లాడుకోవాల్సింది ఇంకేం మిగిలుంది?" అని అమిత్ షా ప్రశ్నించారు.

దారి తప్పిన మావోయిస్టులను తిరిగి జనజీవన స్రవంతిలోకి రప్పించేందుకు గ్రామస్తులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 4.40 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని, దీని ఫలితంగా కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటయ్యాయని వివరించారు. నక్సల్ హింస బాధితుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15,000 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. గడిచిన నెలలోనే 500 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. ఏదైనా గ్రామం నక్సల్ రహితంగా మారితే, దాని అభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం, గత 13 నెలల్లో భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్లలో 305 మంది మావోయిస్టులు హతమవగా, 1,177 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 985 మంది లొంగిపోయారు. ఒక్క బీజాపూర్ జిల్లాలోనే ఈ ఏడాది 410 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు.


More Telugu News