కరూర్ తొక్కిసలాట.. విజయ్ పార్టీ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

  • ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ పిటిషన్
  • విచారణ చేపట్టిన మదురై బెంచ్
  • పోలీసుల దర్యాప్తు ప్రారంభ దశలో ఉండగానే పిటిషన్ వేయడంపై ఆగ్రహం
  • విచారణ సందర్భంగా హైకోర్టు కీలక సూచనలు
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే నిర్వహించిన ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సినీ నటుడు విజయ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై మదురై బెంచ్ విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ధర్మాసనం విజయ్ మరియు ఆయన పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలోనే సీబీఐ దర్యాప్తు కోరడం సముచితం కాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఇదే అంశంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.

విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు వంటి ప్రాథమిక సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రజల ప్రాణాల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.

ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

ముందస్తు బెయిల్ కోరుతూ టీవీకే నమక్కల్ జిల్లా కార్యదర్శి సతీశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. ర్యాలీ సమయంలో జనసమూహాన్ని నియంత్రించడంలో పార్టీ ఎందుకు విఫలమైందని న్యాయమూర్తి ప్రశ్నించారు. తొక్కిసలాట బాధితులకు అదనపు పరిహారం కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


More Telugu News