నాంపల్లిలో అలయ్ బలయ్.. హాజరైన వెంకయ్య, కోమటిరెడ్డి, నాగార్జున, సుజనా చౌదరి

  • దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్
  • హాజరైన తెలంగాణ గవర్నర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
  • అందరం కలిసి ఉండాలనేదే అలయ్ బలయ్ ఉద్దేశమన్న వెంకయ్యనాయుడు
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, వేష భాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందరం ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. దత్తాత్రేయ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. కొందరు కులం, మతం, వర్గం, జాతి పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలు విఫలం కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News