వరుణ్ తేజ్-లావణ్య దంపతుల తనయుడి పేరు ఇదే!

  • విజయదశమి సందర్భంగా తమ కుమారుడి పేరును ప్రకటించిన వరుణ్ తేజ్, లావణ్య
  • బాబుకు 'వాయువ్ తేజ్ కొణిదెల' అని నామకరణం చేసినట్టు వెల్లడి
  • హనుమంతుడి స్ఫూర్తితో ఈ పేరు పెట్టినట్లు తెలిపిన జంట
  • ఆగని శక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక తేజస్సు దీని అర్థమని వివరణ
  • సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్న వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడికి నామకరణం చేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ మొదటి సంతానానికి 'వాయువ్ తేజ్ కొణిదెల' (Vaayuv Tej Konidela) అని పేరు పెట్టినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

"మా జీవితంలోకి వచ్చిన అతిపెద్ద ఆశీర్వాదానికి ఇప్పుడు ఒక పేరు వచ్చింది" అంటూ వరుణ్ తేజ్ ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. తమ కుమారుడి పేరు వెనుక ఉన్న అర్థాన్ని కూడా ఈ జంట వివరించింది. "మా ప్రియమైన కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెలని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ పేరుకు ఆగని శక్తి, భక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక తేజస్సు అని అర్థం. హనుమంతుడి స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుంది" అని వారు పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 10న లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబు రాకతో కొణిదెల కుటుంబంలోనే కాకుండా, మెగా అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మనవడిని చూసి మురిసిపోయారు. "కొణిదెల కుటుంబంలోకి చిన్నారికి స్వాగతం. తల్లిదండ్రులైన వరుణ్, లావణ్యలకు హృదయపూర్వక అభినందనలు" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గతేడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామన్న శుభవార్తను ఈ జంట పంచుకుంది. ఇప్పుడు విజయదశమి నాడు తమ కుమారుడి పేరును ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


More Telugu News