ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ.. రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ బహూకరణ

  • జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన క్రికెటర్
  • తిలక్ వర్మను అభినందించి, సన్మానించిన ముఖ్యమంత్రి
  • క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎంను కలిసిన తిలక్ వర్మ
ఆసియా కప్ ఫైనల్‌లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ... సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు.

క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తిలక్ వర్మ ముఖ్యమంత్రిని కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్టుమెంట్ ఎండీ క్రాంతి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సరూర్ నగర్ మైదానంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ వేడుకలో అతిపెద్ద బతుకమ్మ, అతిపెద్ద జానపద నృత్యంగా సరూర్ నగర్ బతుకమ్మ వేడుక రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది.


More Telugu News