సైబర్ నేరాలపై అవగాహన లేక చాలామంది నష్టపోతున్నారు: నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్

  • నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామన్న సజ్జనార్
  • సైబర్ నేరలాఘ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ప్రముఖులు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయవద్దని సూచన
  • నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న సజ్జనార్
సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత కొరవడటంతో చాలామంది నష్టపోతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నగర నూతన సీపీగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన అన్నారు. నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, కానీ ఇక్కడ మనం డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు. అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నగరంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. నేరగాళ్లు ఎక్కువగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని అన్నారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల యువత బాగా చెడిపోతోందని, అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని ప్రముఖులను కోరారు.

డిజిటల్ అరెస్టుల పేరుతో వచ్చే కాల్స్‌ను విశ్వసించవద్దని ఆయన అన్నారు. అలాగే అరుదైన వ్యాధులకు ఔషధాలు అని చెప్పే వారిని కూడా నమ్మవద్దని హితవు పలికారు. ఆన్‌లైన్ మోసాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. కల్తీ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెడతామని సజ్జనార్ వెల్లడించారు. ఇందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి కల్తీ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య వల్ల సమయం వృథా కావడంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


More Telugu News